
న్యూఢిల్లీ, వెలుగు: ‘దక్షిణ అయోధ్య’గా పిలవబడే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా ఎన్డీఏ సర్కార్ అన్యాయం చేసిందని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. కోట్లాది మంది భక్తులు విశ్వాసాన్ని చూరగొన్న ఈ ఆలయానికి నిధులు ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రాజ్యసభలో రైల్వే మంత్రిత్వ శాఖ పనితీరుపై జరిగిన చర్చలో వద్దిరాజు మాట్లాడారు. ‘రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతా రాం’అంటూ వద్దిరాజు రవిచంద్ర తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
దక్షిణ గంగగా పిలువబడుతున్న గోదావరి నది ఒడ్డున కొలు వైన భద్రాచలం ఆలయం ‘‘దక్షిణ అయోధ్య’’గా పేరొందిందని గుర్తుచేశారు. ఈ ఆలయాన్ని భక్తుల సౌకర్యార్థం మరింత అభివృద్ధి చేయడంలో కేంద్రం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఆలయ అభివృద్ధికి బడ్జెట్‌లో కనీస నిధులు కేటాయించలేదని, రైల్వే లైన్ ఏర్పాటును విస్మరించిందని సభ ద్వారా కేంద్రం దృష్టికి తెచ్చారు.
భద్రాచలం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదని, సాంస్కృతిక, ఆధ్యత్మిక వారసత్వానికి చిహ్నమని తెలిపారు. ఆలయ ప్రాశస్త్యాన్ని గొప్పగా చాటేందుకే గత బీఆర్ఎస్ సర్కార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేసిందని వెల్లడించారు.